సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభం

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని అన్ని రాష్ట్రాల సీఎంలతో తన కార్యాలయం నుంచి చర్చిస్తున్నారు. లాక్‌డౌన్ కొనసాగించాలనే అంశంపై వారి సూచనల్ని స్వీకరిస్తున్నారు. ఇక మే 1 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఒడిశా, పంజాబ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కూడా లాక్‌డౌన్‌ను మరో 2 వారాలపాటు పొడిగించాలని ఇప్పటికే ప్రధానిని కోరారు.


మరోవైపు భారత్‌లో లాక్‌డౌన్‌ను తక్షణమే ఎత్తేస్తే పరిస్థితి దిగజారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వైద్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య పరిశోధన సంస్థ సూచనలను, ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రధాని మోదీ నిర్ణయం ప్రకటించనున్నారు. కాగా, గత నెల 25న విధించిన లాక్‌డౌన్‌ ఈ నెల 14తో ముగియనుంది. అయితే, 3 వారాల లాక్డౌన్‌తో కరోనా పోరులో భారత్‌ సఫలీకృతం కాలేదని పలు అధ్యయనాలు వెల్లడించిన సంగతి విదితమే. 
(చదవండి: లాక్‌డౌన్‌ ఉల్లంఘించి.. బీజేపీ ఎమ్మెల్యే బర్త్‌డే పార్టీ)


సదా మీకు అందుబాటులో ఉంటా..
కరోనా పోరులో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సూచనలు స్వీకరించేందుకు తాను 24/7 అందుబాటులో ఉంటానని ప్రధాని మోదీ తెలిపారు. సీఎంలతో జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన నోటికి తెల్లని మాస్కు ధరించి పాల్గొన్నారు. కాగా, దేశవ్యాప్తంగా శనివారం ఉదయం వరకు 7400 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా.. 239 మంది మరణించారు.