అనకాపల్లి: పెళ్లంటే జీవితాంతం గుర్తుండిపోయే ఒక తియ్యని జ్ఞాపకం. ఉన్నంతలో దాన్ని ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. బంధుమిత్రులు, బాజాభజంత్రీలు, బంతిభోజనాలతో వివాహ వేడుక కనులపండువగా జరుగుతుంది. అయితే కరోనా పుణ్యమా అని పెళ్లి తంతు తూతూమంత్రంగానే పూర్తిచేయాల్సి వస్తోంది. భౌతిక దూరంతోపాటు, సమూహాలు ఉండరాదనే నిబంధనల కారణంగా పెళ్లి సరదాలను పక్కన పెట్టి కుదిరిన మంచి ముహూర్తానికి వివాహం జరిపించేస్తున్నారు.
విశాఖ జిల్లా అనకాపల్లిలో గురువారం రాత్రి జరిగిన ఓ వివాహానికి పురోహితునితో పాటు పెళ్లి కుమారుని తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు. మూడు ముళ్ల బంధానికి ఈ ఐదుగురే సాక్ష్యంగా నిలిచారు. ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ దుక్కవానిపాలెంలో శుక్రవారం జరిగిన మరో వివాహాన్ని కూడా పురోహితుడు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, పెళ్లి కుమారుని తల్లిదండ్రుల సమక్షంలోనే జరిపించేశారు.